సినిమాల నుంచి నేరుగా సీఎం కాలేదు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నా: విజయ్‌

  • అసెంబ్లీలో సీఎం విజయ్‌ సంచలన వ్యాఖ్యలు
  • ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం వల్లే అధికారంలోకి వచ్చానని వ్యాఖ్య
  • కరూర్‌ ఘటనలో 41 మంది మృతిపై ఆవేదన
  • సీఏఏ వ్యతిరేకత, సామాజిక న్యాయం కోసం తాము మొదటి నుంచే పోరాడుతున్నామని వెల్లడి
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి విజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను షూటింగ్‌ నుంచి నేరుగా వచ్చి సీఎం అయినట్లుగా కొందరు ఇమేజ్‌ క్రియేట్‌ చేస్తున్నారన్నారు. కానీ, అందులో నిజం లేదని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో సభ్యుల చర్చలకు సమాధానం ఇస్తూ విజయ్‌ మాట్లాడారు. తమిళ వెట్రి కళగం (టీవీకే)కు మద్దతు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ కోసం అందరూ కలిసి పనిచేస్తే తమిళనాడు దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

“షూటింగ్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చి సీఎం అయినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో చోటు సంపాదించుకున్నందుకే నేను సీఎం అయ్యాను” అని విజయ్‌ వ్యాఖ్యానించారు. 1990ల నుంచే అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు అండగా నిలిచామని విజయ్‌ తెలిపారు. రాజకీయాలపై మాట్లాడినందుకే తన సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొన్నాయని, ఆ విషయాలు అందరికీ తెలుసని అన్నారు. 

అలాగే ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షం తన బాధ్యతలో భాగంగా ప్రశ్నలు లేవనెత్తడం ప్రజాస్వామ్యానికి అవసరమని పేర్కొన్నారు. కరూర్‌ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించిందని అన్నారు. ఆ బాధను మాటల్లో చెప్పలేనని, ఆ విషాదాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు.

తమిళ వెట్రి కళగం ఆవిర్భవించిన వెంటనే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశామని గుర్తుచేశారు. తన సినిమాల్లో కూడా అవినీతి వ్యతిరేకత, సామాజిక న్యాయం, విద్య వంటి అంశాలనే ప్రస్తావించానని చెప్పారు.

Vijay
Tamilaga Vettri Kazhagam
Tamil Nadu Assembly
Udhayanidhi Stalin
TVK Party
Tamil Nadu Politics

More Telugu News